Thursday, September 3, 2020

ఏపీ ప్ర‌భుత్వానికి సుప్రీంలో మ‌ళ్లీ చుక్కెదురు..

 

Supreme Court Dismisses Govt s Petition on HC Orders

ప‌లు ర‌కాల ప్ర‌భుత్వ పిటిష‌న్ల‌పై ఎదురుదెబ్బ‌లు రుచి చూపించిన సుప్రీం కోర్టు మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేసింది. ఈ తీర్పు పూర్వాప‌రాలు ఇలా ఉన్నాయి...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు మీడియాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు తెచ్చిన విష‌యం తెలిసిందే...దీనికి వ్య‌తిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లవ‌డం, వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న హైకోర్టు ప్ర‌భుత్వ జీవోల‌ను కొట్టివేయ‌డం వ‌రుస‌గా జ‌రిగిపోయిన విష‌యం కూడా తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంగ్లీషు మీడియం విద్య‌పై రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లిదండ్రుల‌, విద్యార్ధుల స‌ర్వే నిర్వ‌హించింది. స‌ద‌రు స‌ర్వేలో అత్య‌ధిక శాతం ప్ర‌జ‌లు త‌మ‌కు ఇంగ్లీషు మీడియం అవ‌స‌ర‌మ‌ని తేల్చి చెప్పారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌భుత్వం ఇంగ్లీషు భాష ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకుని అందుకు అనుగుణంగా హైకోర్టు స్టేల‌ను ఎత్తేయాలంటూ సుప్రీంను ఆశ్ర‌యించింది.

అయితే ఈ విష‌యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. స్టేల‌ను ఎత్తేసేందుకు నిరాక‌రిస్తూ పిటిష‌న్ల‌ను కొట్టేస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అత్య‌ధికులు ఇంగ్లీషు భాష కోరుకుంటున్నార‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. దీనికి మ‌ద్ధ‌తుగా ఆయ‌న ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స‌ర్వేను కూడా ఉటంకించారు. అయిన‌ప్ప‌టికీ సుప్రీం క‌నిక‌రించ‌లేదు. తాజా తీర్పుతో వైసీపీ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఏ విధంగా ముందుకు వెళ్ల‌నుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

No comments:

Post a Comment