Saturday, June 27, 2020

ఏపీ సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు

5 Days Working Extension for Secretariat Employees for One Year

ఆంధప్రదేశ్‍ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగించింది. వచ్చే ఏడాది వరకు పొడిగిస్తూ సీఎస్‍ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయం ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్‍ఓడి కార్యాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు వర్తించనుంది.

బొమ్మ ఆడలేదు కానీ థియేటర్ లో 100 రోజులు సీటులే ప్రేక్షకులు


Theaters running unsuccessful 100 days
రన్నింగ్ ఆన్ సక్సెస్ ఫుల్ 100 డేస్!   థియేటర్ సీట్లే ప్రేక్షకులు  
థియేటర్ లో ఒక సినిమా కంటిన్యూ గా 100 రోజులు ఆడితే అది రికార్డు గా పరిగణించి, ఆయా హీరోల అభిమానులు థియేటర్ వద్ద సంబరాలు చేసుకునే వారు.  ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృభిస్తున్న తరుణంలో  బొమ్మ ఆడలేదు కానీ థియేటర్ లో  100 రోజులు సీట్లు ప్రేక్షకులయ్యాయి   మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ సినిమా పరిశ్రమ ఓ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నది. వందేళ్లకుపైగా సినిమా చరిత్రలో 100 రోజులుపాటు సినీ థియేటర్లు మూతపడిన దాఖలాలు లేవు. కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ, కార్మికులు, నటులు, నిర్మాతలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడితే మళ్లీ సినిమా పరిశ్రమను పూర్వ వైభవం వైపు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. గత 100 రోజుల్లో సినీ పరిశ్రమలో చోటుచేసుకొన్న పరిణామాలు ఏమిటంటే..
తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధిని నివారించేందుకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. దాంతో సినీ ప్రేక్షకుల వినోదానికి బ్రేక్ పడింది. రెండు వారాల గడువుతో మొదలైన లాక్‌డౌన్ ఇప్పటికి 100 రోజులకు చేరుకొన్నది.
కరోనా వైరస్ పరిస్థితులు తీవ్రతరం కావడంతో సినిమా షూటింగులు నిలిపివేశారు. టెలివిజన్ సిరియల్స్, షోల షూటింగ్స్ స్టార్ట్ అయినా  అంతరాయం ఏర్పడింది. రోజువారి వేతన కార్మికుల జీవితం సందిగ్గంలో పడింది. పలు సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. దాంతో సినీ పరిశ్రమ కూడా ఇప్పటి వరకు చూడని దారుణమైన పరిస్థితి చూడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా పలు భాషల సినిమా పరిశ్రమల్లో సహాయక చర్యలు ఊపందుకొన్నాయి. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, తదితర నటులు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. ఇక టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైంది. దాంతో ఇండస్ట్రీలోని వేతన కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణి, సహాయ కార్యక్రమాలు రెండు సార్లు  నిర్విరామంగా కొనసాగించాయి.  
సినిమా థియేటర్లు మూత పడటంతో వాటి స్థానంలోకి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాంతోపాటు మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. రిలీజ్‌కు సిద్దమై ఆగిన సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అమృత రామం,  అమితాబ్ నటించిన గులాబో సితాబో, జ్యోతిక నటించిన పోంమగాళ్ వండాల్, కీర్తీ సురేష్ నటించిన పెంగ్విన్, ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 47డేస్ జూన్ 30న, భానుమతి రామకృష్ణ జులై 3న  ఇంకా కొన్ని రిలీజ్‌కు క్యూ కట్టాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత సినీ అగ్రతారలు, నిర్మాతలు కలిసి ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. షూటింగులతోపాటు సినిమాల ప్రదర్శనకు థియేటర్లను ఓపెన్ చేయాలని సర్కార్లకు విన్నపాలు చేశారు. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి షూటింగులకు అనుమతులు ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో షూటింగుల కదలిక మొదలైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో షూటింగులకు యూనిట్లు ముఖం చాటేస్తున్నాయి.  కానీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆట ఆటకు థియేటర్ శానిటైజ్ చేసి సీట్ సీటుకు గ్యాప్ ఏర్పాటు చేసి   న్యూజిలాండ్, దుబాయ్ లాంటి దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా థియేటర్లలో ప్రదర్శనలు ప్రారంభమైనప్పటికీ ప్రేక్షకులు థియేటర్కి రావడానికి సముఖంగా లేరు.  

క్యాట్స్ ఆధ్వర్యంలో కళాసంజీవని

CATS 15th Anniversary Celebrations Kala Sanjivani
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) 15వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని జూన్‍ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కళా సంజీవని పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా జూన్‍ 27వ తేదీన అన్నమయ్య కీర్తనలకు చిత్ర కళార్చన పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మధురగాయక రామానుజ సంకీర్తన ప్రచారక పడాల తారకరామారావు గారి అన్నమయ్య కీర్తనలకు ప్రముఖ చిత్రకారుడు, నంది అవార్డు గ్రహీత కూచి చిత్రలేఖనం కార్యక్రమం 27వ తేదీన నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 నుంచి 10.30 వరకు జరుగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుందని క్యాట్స్ అధ్యక్షురాలు సుధ కొండపు తెలిపారు.
జూన్‍ 28వ తేదీన ఆదివారంనాడు హరికథా చూడామణి, ప్రముఖ హరికథా భాగవతారిణి, నటి, గాయని శ్రీమతి  పడాల కల్యాణి(కరాటే కళ్యాణి) ‘హరికథా గానం’ ఏర్పాటు చేశారు. విశ్వామిత్ర యాగరక్షణ అంశంపై ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30 నుంచి 10.30 వరకు జరుగుతుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లైవ్‍లో ఈ కింది లింక్‍ ద్వారా చూడవచ్చు.

తానా సాంస్కృతికోత్సవం...భారీ వేడుకలకు సన్నాహాలు

TANA World Telugu Cultural Festival on July 24th, 25th and 26th

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) భారీ ఎత్తున ప్రపంచ తెలుగు సాం స్కృతిక మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు భాషా వైభవాన్ని చాటేందుకు ప్రపంచంలోని తెలుగుఅసోసియేషన్లతో కలిసి ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి చెప్పారు. దాదాపు 50కిపైగా తెలుగు అసోసియేషన్లు ఈ వేడుకల్లో పాలుపంచుకుంటున్నాయని వారు తెలిపారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వివిధ అంశాలపై కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం, భువనవిజయం పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగు వెలుగు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తెలుగుపద్యాలు, సామెతలు వివరణ, పరభాష లేకుండా తెలుగు పలుకు, తెలుగు కవితాగానం, చందమామ రావే కథలు ఉన్నాయి. రాగమంజరి పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జానపద, శాస్త్రీయ సంగీతాలు, సినిమా, లలిత గీతాలు ఉన్నాయి. నాదామృతం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వయోలిన్‍, తబల, వీణ, కీ బోర్డ్, మృదంగం, ఫ్లూట్‍ వంటివి ఉన్నాయి. అందెల రవళి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో జానపద, శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యాలు మొదలైనవి ఉన్నాయి. కళాకృతి పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏకపాత్రాభినయం, మూకాభినయం, ఇద్దరు లేదా ముగ్గురితో సన్నివేశ నటన వంటివి ఉన్నాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ కింది ఫోన్‍ నెంబర్‍లో, లేదా ఇ-మెయిల్‍లో సంప్రదించవచ్చు.
వంశీ- 860 805 5406
worldteluguculturalfest@tana.org