Saturday, September 19, 2020

టిటిడి చైర్మన్ ప్రకటన వెనక్కి తీసుకోవాల్సిందే...సోము వీర్రాజు

 





తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్‍ ఇవ్వక్కర్లేదు అంటూ టీటీడీ చైర్మన్‍ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ చీఫ్‍ సోము వీర్రాజు మండిపడ్డారు. టీటీడీ బోర్డు చైర్మన్‍ వెలువరించిన అంశాన్ని బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. స్వర్గీయ అబ్దుల్‍ కలాం అంతటి వ్యక్తి తిరుమల వచ్చినప్పుడు అక్కడున్న రిజిస్టర్‍ లో సంతకం పెట్టి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం జరిగిందని వివరించారు. ఇది యావత్‍ భారతదేశంలో అన్యమతస్థులకు వర్తించే అంశమని, దీన్ని గమనించి ప్రకటన చేయాల్సిన సమయంలో సుబ్బారెడ్డి వివాదాస్పద రీతిలో ప్రస్తావించడం ఆయన అనాలోచిత వైఖరికి నిదర్శనం అని సోము పేర్కొన్నారు. అన్యమతస్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్‍ ఇవ్వాల్సిన అవసరంలేదని, వారు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలతో దర్శనం చేసుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

చురుగ్గా అంతర్వేది రథం నిర్మాణం పనులు..




 అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.. దీనిలో భాగంగా రావులపాలెం టింబర్‍ డిపోలో రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్‍ టేకు కలప దుంగలను అధికారులు గుర్తించారు. 21 అడుగుల పొడవైన దూలాలుగా వాటిని కోయించే పక్రియ నేడు ప్రారంభమైంది. రథం నిర్మాణానికి 1330 ఘనపుటడుగుల కలప వినియోగిస్తున్నామని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‍ రామచంద్ర మోహన్‍ తెలిపారు. పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇటీవల వివరించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు

నితిన్ తో జత కట్టిన తమన్నా, నాభ నటేష్

 



హిందీ సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'అంధాధున్‌'కు అఫిషియ‌ల్ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా, మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నవంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న‌ది. ఒరిజిన‌ల్‌లో ట‌బు, రాధికా ఆప్టే పోషించిన పాత్ర‌ల‌కు త‌మ‌న్నా, న‌భా న‌టేష్ ఎంపిక‌య్యారు.'అంధాధున్‌'లో త‌న న‌ట‌న‌తో ట‌బు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అమితంగా పొంద‌డంతో పాటు ఫిల్మ్‌ఫేర్ స‌హా ప‌లు అవార్డుల‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు ప‌లు షేడ్స్ ఉండే ఆ రోల్‌ను చేసే స‌వాలును స్వీక‌రించారు త‌మ‌న్నా. ప్ర‌తి పాత్ర‌కూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ల‌భించినందుకు న‌భా న‌టేష్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6గా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండ‌గా, ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్నారు.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి ప‌నిచేసే ఇత‌ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.
సాంకేతిక బృందం: సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: హ‌రి కె. వేదాంత్‌ స‌మ‌ర్ప‌ణ‌:  ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లు:  ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి సంభాష‌ణ‌లు, ద‌ర్శ‌క‌త్వం:  మేర్ల‌పాక గాంధీ.

గంగ‌వ్వ‌ను బిగ్ బాస్ జైలు నుండి బ‌య‌ట‌కు పంపించాలంటూ భారీగా నెటిజ‌న్ల పోస్టులు




'గంగ‌వ్వ‌ను గెలిపించ‌డ‌మే ఏకైక ల‌క్ష్యం' సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపించేది, ఇటువంటి పోస్టులే క‌నిపించేవి. ఇది మొన్న‌టి మాట‌. ఎప్పుడైతే హౌస్‌లో అనారోగ్యంతో అవ‌స్థ‌లు ప‌డుతున్న అవ్వ‌ను చూశారో అప్ప‌టి నుంచి చాలామంది మన‌సు మార్చుకున్నారు. మీ ఆట కోసం, టీఆర్పీల కోసం ఆమెను బ‌లి చేయ‌కండ‌ని వేడుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పీఆర్వో ర‌మేశ్ హ‌జారి ఫేస్‌బుక్‌లోనూ ఇదే త‌ర‌హా పోస్టు పెట్టారు. గంగ‌వ్వ‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని క్యాంపెయిన్ చేప‌ట్టారు. ఈ మేర‌కు శ‌నివారం సుదీర్ఘ పోస్టును నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు. అస‌లు జైలు లాంటి బిగ్‌బాస్ ఇంట్లోకి పొమ్మ‌ని ఎవ‌రు చెప్పార‌ని అవ్వ‌ను ప్ర‌శ్నించారు. అక్క‌డ అన్ని సౌక‌ర్యాలుంటాయి గానీ మ‌న‌సున్న మ‌నుషులు దొర‌క‌ర‌ని వాపోయారు.

న‌వ్వుకు, ఏడుపుకు కూడా రేటింగులుంటాయ‌ని, మాన‌వ సంబంధాల‌కు ప‌రీక్ష పెట్టే ప్ర‌యోగ‌శాల అని రాసుకొచ్చారు. అక్క‌డ అవ్వ‌ ఆరోగ్యాన్ని ఎవ‌రు చూసుకుంటార‌ని దిగులు చెందారు. క‌నిపించ‌కుండా కేవ‌లం విన‌బ‌డే బిగ్‌బాస్ ఎవ‌రి బాగోగులు కోరే వ్య‌క్తి కాద‌ని, నిన్ను బొమ్మ‌ను చేసి అడిస్తాడ‌ని, నీ శ‌క్తినంతా గుంజుకుంటాడ‌ని ఆవేద‌న చెందారు. నీ ఏడుపు అత‌నికి పైస‌లు కురిపిస్తాయ‌ని విమ‌ర్శించారు. బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని ఓ పెద్ద ఉద్య‌మం లేస్తే త‌ప్ప త‌న‌ను వ‌దిలేలా లేర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. "మాన‌వ సంబంధాల‌ను బందీల‌ను చేసి ప‌రీక్ష పెడుతున్న బిగ్‌బాస్ జైలు నుంచి గంగ‌వ్వ‌ను విడుద‌ల చేయాల‌ని పోరాడుదాం. గంగ‌వ్వ‌ను జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి తీసుకువ‌ద్దాం" అని పిలుపునిచ్చారు. ఈ పోస్టుకు ప‌లువురు నెటిజ‌న్లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. 

డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు



కరోనా వైరస్‍ వ్యాక్సిన్‍పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరులందరికీ సరిపడా వ్యాక్సిన్‍ డోసులు ఏప్రిల్‍ 2021 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వ్యాక్సిన్‍కు అనుమతులు లభించిన వెంటనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా లక్షలాది డోసులు ఉత్పత్తి చేస్తాం. ఏప్రిల్‍ 2021 నాటికి అందరికీ సరిపడా వ్యాక్సిన్‍ డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నాం అని శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యాక్సిన్‍ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ట్రంప్‍ తెలిపారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్‍ ట్రయల్స్కు చేరుకున్నాయన్నారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే వ్యాక్సిన్‍ ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు అనేక ఆంక్షలకు సైతం టీక్‍ చెక్‍ పెట్టనుందన్నారు. సత్ఫలితాలిచ్చే అవకాశం ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తిని ఇప్పటికే భారీ ఎత్తున ప్రారంభించామన్నారు.

ఏపీలో 8 వేలకు పైనే కేసులు





 ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా వైరస్‍ ఉద్ధ•తి కొనసాగుతోంది. తాజాగా మరో 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 74,595 శాంపిల్స్ పరీక్షించగా, 8218 పాజిటివ్‍ కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. 10,820 మంది కొత్తగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా 50,33,676 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,17,776 పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5302 మంది ప్రాణాలు కోల్పోగా.. 5,30,711 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 81,763 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వైరస్‍ తీవ్రత కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1395 కేసులు నమోదవ్వగా, పశ్చిమగోదావరి జిల్లాలో 1071 పాజిటివ్‍ కేసులు వచ్చాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు జిల్లాలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, కృష్ణా జిల్లాలో ఏడుగురు, అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో నలుగురేసి చొప్పున మృతిచెందారు. అలాగే, తూర్పు గోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి మృతి చెందగా, విజయనగరం జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు.